
పోలీస్ స్టేషన్ కు వచ్చిన విచిత్రమైన ఫిర్యాదులను చూసి పోలీసులు ఒక్కోసారి తలలు పట్టుకుంటారు.. జుట్టు పీక్కొంటారు. కేసు నమోదు చేయాలో ... చేయకూడదో తెలియని పరిస్థితి. ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లాలో ఇలాంటి విచిత్రమైన కేసు నమోదైంది. అంతేకాదు కోళ్ల గుండె, కాలేయం, ఊపిరితిత్తులు.. ఇతర ముఖ్యమైన అవయవాలను టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపారు. మీకేమన్న పిచ్చా... వెర్రా.. చచ్చిన కోళ్ల గుండెను ల్యాబ్ కు పంపడమేంటరా.. ఇది అక్షరాల నిజమండి.. అసలు విషయానికొస్తే...
చిత్తూరు జిల్లాలో నాటుకోళ్ల పంచాయితీ పోలీస్ స్టేషనకు చేరింది. పూతలపట్టు మండలం బత్తుల వారి పల్లి గ్రామంలో సుభాషిని అనే మహిళ తన నాటుకోళ్లను మందు పెట్టి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కోళ్లు పక్కింట్లో చెట్ల మధ్య తిరుగుతున్నాయని కావాలనే చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. కోళ్లను చంపేందుకు మొక్కలకు యూరియా చల్లారని.. ఐదు నాటు కోళ్లు అది తిని మరణించాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పశు వైద్యాధికారి సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించి.. మరణించిన కోళ్ల గుండె, కాలేయం కొన్ని భాగాలని ల్యాబ్ పరీక్షలకు తరలించారు.